IOCLలో ఇంజినీర్ మరియు క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులు: జీతం లక్షకు పైనే..!!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ మరియు జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఓసీఎల్ రిఫైనరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 513 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఐఓసీఎల్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ మరియు జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికనే ఉంటాయి. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ మరియు జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులకు వేతనం నెలకు రూ.25,000-రూ.1,05,000 వరకు ఉంటుంది. ఇక ఖాళీల పరంగా ఏయే రిఫైనరీలో ఎన్ని పోస్టులున్నాయో తెలుసుకుందాం. పారాదీప్ రిఫైనరీలో 99 పోస్టులు ఉండగా, బొన్‌గైగావ్ రిఫైనరీలో 34 పోస్టులు, దిగ్బాయ్ రిఫైనరీలో 78 పోస్టులు, పానిపత్ రిఫైనరీలో 87 పోస్టులు, మథురా రిఫైనరీలో 56 పోస్టులు, హల్దియా రిఫైనరీలో 07 పోస్టులు, గుజరాత్ రిఫైనరీలో 67 పోస్టులు, బారౌనీ రిఫైనరీలో 41 పోస్టులు, గౌహతి రిఫైనరీలో 44 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత విషయానికొస్తే గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా బోర్డు నుంచి ఆయా సబ్జెక్టుల్లో లేదా బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. అదే సమయంలో ఏడాది పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇక పూర్తి విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను అభ్యర్థులు చూడాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు గరిష్టంగా 26 ఏళ్లు 30 సెప్టెంబర్ 2021 నాటికి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం సూచించిన మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా 31 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 29 ఏళ్లు ఉండాలి. దివ్యాంగులకు గరిష్టంగా 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులకు రాతపరీక్ష మరియు స్కిల్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి. దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులు రూ.150/- పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఇక ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 12 అక్టోబర్ 2021 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా పేర్కొంది.