IIT Entrance: గుడ్‌న్యూస్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ రాయకుండానే ఐఐటీ సీటు.. ఎలా..?
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో అర్హత సాధించాలంటే విద్యార్థులు కఠినమైన ప్రిపరేషన్, ఎంపిక ప్రక్రియలను అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇందులో అర్హత సాధించిన చాలా మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకే ఉత్సుకత చూపిస్తారు.

మన దేశంలో చాలా మంది విద్యార్థులు ఐఐటీలో సీటు సంపాదించాలని కలలు కంటుంటారు. అందుకోసం పదో తరగతి అయిపోగానే జేఈఈ మెయిన్స్ (JEE Mains), అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఇందులో మెరిట్‌లో అర్హత సాధిస్తే సీటు కన్ఫార్మ్ అవుతుంది. అయితే ఈ ఐఐటీ ఎంట్రన్స్ (IIT entrance) పరీక్ష రాయకుండానే ఐఐటీలో సీటు సంపాదించవచ్చట. అది ఎలాగో మీకు తెలుసా? ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్(International Olympiad)లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులు నేరుగా ఐఐటీ(IIT)లో చేరవచ్చని సమాచారం. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో పాల్గొని, అందులో ప్రదర్శన ఆధారంగా నేరుగా అడ్మిషన్లు ఇచ్చే ఆలోచనలో ఐఐటీ కాన్పూర్ (IIT kanpur) ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో అర్హత సాధించాలంటే విద్యార్థులు కఠినమైన ప్రిపరేషన్, ఎంపిక ప్రక్రియలను అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇందులో అర్హత సాధించిన చాలా మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకే ఉత్సుకత చూపిస్తారు. ఆ ప్రతిభను భారత్‌లోనే నిలుపుకునేందుకు ప్రత్యామ్నాయ రీతిలో ఐఐటీలో ప్రవేశం కల్పించాలని ఐఐటీ కాన్పూర్ యోచిస్తోంది. ఒలింపియాడ్‌కు అర్హత సాధించిన విద్యార్థులు తమ ప్రత్యేక సబ్జెక్టుల విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఐఐటీల్లోని వివిధ విభాగాలు ఈ నిర్ణయానికి ఆమోదం తెలపాల్సి ఉంది.
ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఆధారంగా ఐఐటీ ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అభ్యర్థుల ప్రవేశానికి ఎలాంటి హామీ లేదని ఐఐటీ కాన్పూర్ అండర్ గ్రాడ్యుయేట్ అకడమిక్ రివ్యూ కమిటీ (IIT kanpur Under Graduate academic review committee) చైర్‌పర్సన్ నితిన్ సక్సెనా అన్నారు. ఈ మార్గం ద్వారా అత్యంత అర్హత కలిగిన విద్యార్థులను మాత్రమే సంస్థలోకి ప్రవేశించేలా అనేక చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
2018లో ఐఐటీ బాంబే కూడా ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను బీఎస్సీ మ్యాథ్స్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. ఇందుకోసం కొన్ని సీట్లను కేటాయించింది. ఒలింపియాడ్‌లు ఓ నిర్దిష్ట సబ్జెక్టులో విభిన్నమైన లోతైన పరిజ్ఞానం ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసే సముచిత పరీక్షలు. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో పట్టు సాధించాలి. గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సమాధానమివ్వాలి. జేఈఈ మెయిన్స్ లో టాప్ 2.5 లక్షల ర్యాంకులో నిలిచిన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. చివరకు కొద్దిమందికి మాత్రమే అవకాశం లభిస్తుంది.