top of page

నీట్ యూజీ పరీక్ష వాయిదా వేయండి ప్లీజ్​.. కేంద్రానికి విద్యార్థుల రిక్వెస్ట్.. కారణం ఏంటంటే?



నీట్​ పరీక్ష తేదీ మార్చాలని విద్యార్థుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్​లో పలు జాతీయ, రాష్ట్రీయ పోటీపరీక్షలు ఉండటంతో నీట్​ పరీక్షకు హాజరుకాలేమని, దయచేసి తేదీ మార్చాలని ట్విట్టర్​ వేదికగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


దేశవ్యాప్తంగా వివిధ మెడికల్, డెంటల్​ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్ యూజీ ఎగ్జామ్​కు లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. ఏప్రిల్​లోనే జరగాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్​ 12న ఈ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే, నీట్​ పరీక్ష తేదీ మార్చాలని విద్యార్థుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్​లో పలు జాతీయ, రాష్ట్రీయ పోటీపరీక్షలు ఉండటంతో నీట్​ పరీక్షకు హాజరుకాలేమని, దయచేసి తేదీ మార్చాలని ట్విట్టర్​ వేదికగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


మరోవైపు, ఈ సారి నీట్​ ఎగ్జామ్​ ప్యాటర్న్​లో మార్పులు చేసిన కారణంగా తమకు కొత్త ప్యాటర్న్​ అర్థం చేసుకునేందుకు మరింత సమయం కావాలని మరికొందరు చెబుతున్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్ష తేదీని పొడిగించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో #PostpobeNEETUG అనే హ్యాష్​ట్యాగ్​ను ట్రెండింగ్​ చేస్తున్నారు.


‘‘సెప్టెంబర్​ 12న నీట్​ యూజీ, సెప్టెంబర్​ 13న ఐసీఏఆర్​ యూజీ పరీక్షలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో సెంటర్లు ఉన్నవారు రెండు పరీక్షలకు హాజరవడం అసాధ్యం. దయచేసి ఇబ్బందిని గమనించి పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నా” అని ఒక విద్యార్థి ట్విట్టర్​ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. దీంతోపాటు మహారాష్ట్రలో నిర్వహించే MHT CET 2021, కర్ణాటకలో నిర్వహించే CoMEDK టెస్ట్​, ఒడిశా జేఈఈ వంటి ఇతర పరీక్షలు కూడా నీట్​ యూజీ పరీక్ష తేదీకి దగ్గర్లో ఉన్నాయని అనేక మంది విద్యార్థులు ట్వీట్​ చేస్తున్నారు. అందువల్ల, నీట్​ యూజీ పరీక్షను అక్టోబర్ వరకు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


అక్టోబర్​కు వాయిదా వేయాలని విజ్ఞప్తి..


మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 12 వ తరగతి ఇంప్రూవ్‌మెంట్, కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్య జరగనున్నాయి. షెడ్యూల్​ ప్రకారం, సెప్టెంబర్ 13 న సీబీఎస్​ఈ గణిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంటే, నీట్​ పరీక్ష రాసిన మరుసరి రోజే విద్యార్థులు ఈ పరీక్షకు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇలా గ్యాప్​ లేకుండా పరీక్షలకు హాజరవ్వడం కష్టమని, దయచేసి నీట్​ పరీక్షను అక్టోబర్​కు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.