Visakhapatnam: విశాఖకు ముంపు ప్రమాదం ఉందా..? ఐపీసీసీ నివేదికపై నిపుణులు ఏమంటున్నారంటే..?
రెండు రోజులుగా విశాఖపట్నం (Visakhapatnam) సముద్రంలో మునిగిపోతుందన్న అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. మరో 80 ఏళ్లలో విశాఖ నగరం నీటిలో మునిగిపోతుందని.

రెండు రోజులుగా విశాఖపట్నం సముద్రంలో మునిగిపోతుందన్న అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. మరో 80 ఏళ్లలో విశాఖనగరం మూడు అడుగుల నీటిలో ఉంటుందని.. ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రమాదముందని ఓ నివేదిక తేల్చింది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) ఇచ్చిన ఈ నివేదిక అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
విశాఖపట్నం సహా దేశంలోని కనీసం 12 నగరాలు మూడు అడుగుల మేర సముద్రపు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది. అయితే విశాఖపట్నం మునిగిపోయే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. తూర్పు కనుమల కొండ ప్రాంతాలు సముద్రానికి అడ్డుగా ఉండటం వల్ల, నగరం మునిగిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు.
సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుందని కానీ ఒకే స్థాయిలో పెరగదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ హెడ్ జీపీఎస్ మూర్తి చెప్పారు. ఐపీసీసీ నివేదిక ఒక అంచనా మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఐపీసీసీ అంచనాలు కేవలం ప్రస్తుత వాతావరణ మార్పులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని మూర్తి చెప్పారు. ఉష్ణోగ్రత పెరుగుదల, కార్బన్ డయాక్సైడ్ విడుదల, మంచు కొండలు కరిగిపోవడం వంటి ప్రస్తుత ధోరణుల ఆధారంగా ఐపీసీసీ అంచనాలు ఉంటాయని తెలిపారు.
రాబోయే ఆరు నుంచి ఏడు దశాబ్దాలలో అనేక వాతావరణ మార్పులు చోటుచేసుకోవచ్చని చెప్పారు. ఒక చిన్న సముద్రపు ఉప్పెన కూడా లోతట్టు ప్రాంతాలైన నెల్లూరు, చెన్నైలలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతుందని.. కానీ విశాఖపట్నంలోని సముద్ర జలాలు బీచ్ రోడ్డును కూడా చేరుకోలేవని మూర్తి విశ్లేషించారు. దీనికి కారణం విశాఖపట్నం భౌగోళిక స్థానాలు చాలా అనుకూలంగా ఉండటమే అని వివరించారు.
మాజీ ప్రొఫెసర్, ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ పికెవిఎస్ఆర్ ప్రసాద్ కూడా ఐపీసీసీ నివేదికపై స్పందించారు. పదేళ్ల క్రితమే ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ 'భారత తీరాలలో సముద్ర మట్టం మార్పులు' అనే ఓ అధ్యయనాన్ని నిర్వహించిందని తెలిపారు. అయితే విశాఖపట్నం వద్ద ఏడాదికి సముద్రమట్టంలో 0.4 మిమీ పెరుగుదల మాత్రమే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు.